Pawan Kalyan: రాయి దాడి ఘటనకు బాధ్యత వహించాల్సిన అధికారులకే విచారణ బాధ్యత అప్పగించడమా?: పవన్ ఆగ్రహం

  • సీఎం జగన్ పై రాయి దాడి
  • సీఎం జగన్ కు అత్యున్నత భద్రత ఉంటుందన్న పవన్
  • కరెంటు ఎలా పోతుందని ప్రశ్న
  • బాధ్యులైన అధికారులను వెంటనే బదిలీ చేయాలని డిమాండ్
  • నిజాయతీపరులైన అధికారులకు విచారణ బాధ్యతలు అప్పగించాలని స్పష్టీకరణ
Pawan Kalyan reacts on stone attack issue

సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి ఘటన ఇంటెలిజెన్స్ డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ పోలీస్ కమిషన్, సీఎం భద్రతాధికారుల వైఫల్యమేనని జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అయితే ఈ ఘటనకు బాధ్యత వహించాల్సిన అధికారులకే, ఈ ఘటనపై విచారణ జరిపే బాధ్యతలు అప్పగించడం ఏం సందేశం ఇస్తోంది? అని ప్రశ్నించారు. 

"గత కొన్నేళ్లుగా విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో పట్టపగలు పరదాలు ఉపయోగిస్తున్నారు. సీఎం జగన్ కు భద్రత అంటూ పచ్చని చెట్లను కూడా వదలడంలేదు. సీఎం జగన్ వంటి వీవీఐపీ వ్యక్తికి 24×7 భద్రత ఉంటుంది. మరలాంటప్పుడు సీఎం జగన్ సభలో కరెంటు పోవడం ఎలా సంభవించింది? ముఖ్యమంత్రి సెక్యూరిటీ అంత బలహీనంగా, అంత అసమర్థతతో ఉందా? ఏపీ ప్రజలకు దీని ద్వారా ఏం సందేశం ఇస్తున్నట్టు? 

ఇటీవల ప్రధాని మోదీ ఏపీకి వచ్చినప్పుడు ఆయన సభలో తీవ్రస్థాయిలో భద్రతా వైఫల్యాలు చోటుచేసుకున్నాయి. ఇప్పుడు సీఎంపైనే రాయి దాడి జరిగింది. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను తక్షణమే బదిలీ చేయాలి. విచారణ బాధ్యతలను సమర్థులైన, నిజాయతీపరులైన అధికారులకు అప్పగించాలి. అప్పుడు గానీ... గులకరాయి విసిరిన చేయి ఎవరిదో, ఆ చేయి వెనుక ఉన్నది ఎవరో బయటపడుతుంది... సూత్రధారులు ఎవరో, పాత్రధారులు ఎవరో తేలుతుంది. 

ఆంధ్రప్రదేశ్ లో స్వేచ్ఛాయుత వాతావరణంలో, నికార్సయిన రీతిలో, సజావుగా, పారదర్శకంగా ఎన్నికలు జరగాలంటే... బలమైన సంస్థాగత యంత్రాంగాన్ని నెలకొల్పాలి. ముఖ్యంగా, పార్టీలకు, సంస్థలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ గట్టి భద్రత కల్పించాలి. జనసేన పార్టీ తరఫున ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకెళుతున్నాను. తగిన చర్యలు తీసుకోవాలని వారిని కోరుతున్నాను" అంటూ పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. 

అంతేకాదు, తన ట్వీట్ కు ఈసీ, ఏపీ సీఈవో, కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ రాజీవ్ కుమార్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర హోమంత్రిత్వ శాఖలను తన ట్వీట్ కు ట్యాగ్ చేశారు.

More Telugu News